నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి : మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు పంటలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదుకోవాల్సిన సమయంలో సర్కార్ ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికే లక్షలాది ఎకరాలు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జగన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. పంటలను కోల్పోయిన తీవ్ర ఇబ్బందులకు లోనైన వారికి భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు. కూటమి సర్కార్ వచ్చాక మరింత ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు జగన్ రెడ్డి.
తమ హయాంలో ఆర్బీకే సెంటర్లు అద్భుతంగా పని చేశాయని, పంటల బీమాను సమర్థవంతంగా అమలు చేయడం జరిగిందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు బీమా చెల్లించారో చెప్పాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. కేవలం వ్యక్తిగత ప్రచారం తప్పా చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. హామీల పేరుతో మోసం చేయడం తప్పా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చిన పాపాన పోలేదన్నారు జగన్ రెడ్డి. ఇదిలా ఉండగా పోలీసులు ఆంక్షలు పెట్టినా, కూటమి నేతలు బెదిరింపులకి పాల్పడినా.. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనకు జనం పోటెత్తారు.






