నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేదన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజకీయాల్లో పార్టీలకు, వ్యక్తులకు మధ్య భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయి. అంత మాత్రాన ఇష్టమున్నట్లు ఎదుటి వారిని తూల నాడడం అనేది కుసంస్కారాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రెండు తరాల భవిష్యత్ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో తరం నష్ట పోవద్దని దీక్షా, దక్షతలతో శక్తిని కూడగట్టుకుని అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేసేలా చేశారన్నారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, మరోవైపు ఇంటిదొంగలు, పక్కవారు రకరకాల కేసులతో ప్రాజెక్టులు, ఉద్యోగుల, హైకోర్టు విభజనలను అడ్డుకుంటూ అవరోధాలు కల్పించినా అన్నింటినీ ఛేదించుకంటూ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, ప్రకటనలు, అవార్డులు, పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనలే సాక్ష్యం అన్నారు. ప్రజాస్వామ్య పీఠం మీద కూర్చున్న సీఎం నేను ఇలాగే మాట్లాడతాను అంటే అంతకు మించిన అపరిపక్వత ఇంకోటి ఉండదన్నారు. వనరులు సమీకరించుకుంటూ కేంద్ర జల వనరుల నిపుణులు ప్రశంసించినట్లు ఇంజనీరింగ్ మార్వెల్ కాళేశ్వరం నిర్మించారని చెప్పారు.






