మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన మంత్రి
అమరావతి : స్వార్థపూరిత రాజకీయాలకు జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రాస్ అని మంత్రి సవిత మండిపడ్డారు. అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు బీసీలను అన్ని విధాలా వేధింపులకు పాల్పడి, వారికి నరకం చూపిన ప్రబుద్ధుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించాడని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించిన చరిత్ర ఆయనదేని అన్నారు. కల్తీ మద్యం తయారీ, అమ్మకాల్లో జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేయడంతో బీసీల పేరుతో జగన్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీశాడన్నారు. జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలపై వేధింపులకు పాల్పడినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా..? అని మంత్రి సవిత ప్రశ్నించారు. బీసీ నిధులు పక్కదారి పట్టించడంపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో, ఆ సంఘ నాయకులైన ప్రస్తుత మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి వంటి వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినప్పుడు వెనుబడిన తరగతులు వారు గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు.
నా బీసీలంటూ ఓట్లు వేయించుకుని, వారిని అన్ని విధాల అణచివేసిన చరిత్ర జగన్ దేనన్నారు. ఆయన బీసీల ద్రోహి అని మండిపడ్డారు. కల్తీ మద్యం తయారీలో జోగి రమేష్ ఉన్నట్లు ఏ 1 జనార్దనరావు పోలీసులకు చెప్పాడన్నారు. జనార్దనరావు ఎవరో జోగి రమేష్ కు తెలియదని జగన్ చెబుతున్నాడన్నారు. తాను, జనార్దనరావు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మని జోగి రమేష్ అంటున్నాడని, ప్రజలు ఎవరి మాటలు నమ్మాలని మంత్రి సవిత ప్రశ్నించారు. జోగి రమేష్ పై ఉన్న ప్రేమ బీసీలపై జగన్ కు లేదన్నారు. బీసీల పేరుతో జగన్ డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కక్ష సాధింపులకు తావే లేదన్నారు. కల్తీ మద్యం తయారీలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు.






