ఏపీ సర్కార్ పెట్టుబడులకు సాదర స్వాగతం
లండన్ : పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆయన ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) – 2025 ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రితో పలువురు మాట్లాడారు. అక్కడి మీడియాతో ఆయన తమ వివరాలను పంచుకున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ రాష్ట్రంలో సర్కార్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందన్నారు.
ఇందులో భాగంగా అత్యధికంగా పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. సమర్థవంతమైన నాయకులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల సారథ్యంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు కందుల దుర్గేష్. ఏపీ పర్యాటక ఖ్యాతిని ఇక్కడ ప్రపంచ వేదికగా ప్రదర్శించడం తనకు ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఉత్సుకత కలిగిన పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు మంత్రి. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు కందుల దుర్గేష్. ఇదే సమయంలో కూచిపూడి నృత్యంతో రాష్ట్ర పర్యాటక స్టాల్ను ఏర్పాటు చేయడం కూడా సంతోషం కలిగించిందన్నారు.






