మోసానికి చిరునామా కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ జన్మతః వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశారని, ఇందుకు జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమై పోయిందని, ఇక మెజారిటీ ఎంత వస్తుందో తేలాల్సి ఉందన్నారు. దాని కోసమే తాము వేచి చూస్తున్నామని చెప్పారు కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అన్ని రంగాలలో టాప్ లో నిలిచేలా చేశామన్నారు. తమ నాయకుడిని విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి లేదన్నారు.
శాంతి భద్రతలు కాపాడి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. లెక్కలేనన్ని పరిశ్రమలను తీసుకు వచ్చిన ఘనత తమదేనని అన్నారు. ఆనాడు 3 లక్షల మంది ఐటీ సెక్టార్ లో ఉంటే తాము వచ్చాక 10 లక్షలకు పెంచడం జరిగిందని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదన్నారు. ఇమామ్లను, పూజారులను, పాస్టర్లను.. ఇలా సబ్బండ వర్ణాలను మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. అత్తలకు రూ. 4 వేలు, కోడళ్లకు రూ. 2500, వృద్ధులకు రూ. 4 వేలు పెన్షన్ అన్నారని , అంతే కాదు తులం బంగారం అంటూ నిట్ట నిలువునా మోసం చేశారంటూ వాపోయారు. యువతులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, రైతన్నలకు రూ. 15 వేలు, రూ. 2 లక్షల రుణమాఫీ అన్నారని ఎక్కడ చేశారంటూ ప్రశ్నించారు కేటీఆర్.






