హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి
లండన్ : జీవితంలో మరిచి పోలేని సన్నివేశం ఇదని , తాను ఏనాడూ పురస్కారాలు అందుకుంటానని అనుకోలేదని అన్నారు హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి. లండన్ వేదికగా జరిగిన పురస్కార మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. భువనేశ్వరితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రవాస ఆంధ్రులు కూడా పాల్గొన్నారు. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుతో పాటు సంస్థను మెరుగైన రీతిలో నిర్వహిస్తున్నందుకు గాను ఎండీ హోదాలో మరో అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ప్రసంగించారు నారా భువనేశ్వరి.
తన పనితీరును గుర్తించి సత్కరించినందుకు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్త సీఎం చంద్రబాబు, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, సోదరుడు, నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబానికి కూడా థ్యాంక్స్ తెలియ చేశారు . అంతేకాకుండా తనకు జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, నందమూరి బసవతారకం కు రుణపడి ఉంటానని చెప్పారు నారా భువనేశ్వరి. వారు లేక పోతే తాను లేనని అన్నారు. తన భర్త నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. జీవితంలో ఆటుపోట్లు ఎంతటి వారికైనా వస్తుంటాయని, ఆ సమయంలో అధైర్య పడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ అవార్డులు తనపై మరింత బాధ్యతను పెంచేలా చేశాయన్నారు.






