మేలు జరిగిందంటూ ప్రదర్శనలు
హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు జనం నుంచి మద్దతు లభిస్తోంది. హైడ్రా లేకుంటే ఈ పార్కులు కాపాడగలిగే వాళ్లమా, చెరువులు కబ్జాలు కాకుండా చూడగలమా అంటూ స్థానికులు నినదించారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే.. వరద కష్టాలు లేకుండా చేసింది హైడ్రా అంటూ కీర్తించారు. దశాబ్ద కాలంగా పేరుకు పోయిన పూడికను తొలగించడంతో నగరంలోని నాలాల ద్వారా వరద నీరు సాఫీగా సాగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వర్షం వస్తే వరుణిడితో సమానంగా పోటీపడి రహదారులపై కాపుకాసి వరద కష్టాలు తీర్చిన హైడ్రా ఉండాల్సిందే అంటూ ప్ల కార్డులతో ప్రదర్శన చేపట్టారు. ప్రాణ వాయువును అందించే పార్కులను కాపాడి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన హైడ్రా అంటూ ప్రశంసించారు. వరదలు లేని నగరం హైడ్రాతోనే సాధ్యం అంటూ నినదించారు. కబ్జాదారుల విధ్వంశం ఆగాలంటే హైడ్రా ఉండాల్సిందే.. ఆపద ఏదైనా హైడ్రా ఆపన్న హస్తం అంటూ చిన్నా పెద్దా కొనియాడారు.
హైడ్రాపై దుష్ప్రచారం తగదని పలువురు ఈ సందర్భంగా హితవు పలికారు. కొంతమంది స్వార్థానికి అందరూ బలి కావద్దని అన్నారు. ఇటీవల పాతబస్తీ చాంద్రాయణ గుట్టలోని హఫీజ్ బాబా నగర్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. రహదారి విస్తరణలో భాగంగా ఇప్పటికే ఆ మార్గంలో ఉన్న భవనాలకు నష్టపరిహారం కూడా చెల్లించడమైంది. రహదారి విస్తరణతో పాటు నాలా పనుల వల్ల అర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ ను GHMC తొలగించింది. దీనిని కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాద్యమాల్లో ప్రసారం చేయడాన్ని కూడా పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పని చేస్తున్న విషయం పలు సందర్భాల్లో నిరూపితమైందని పేర్కొన్నారు. దశాబ్దాల సమస్యలను గంటల్లో రోజుల్లో పరిష్కరించే సత్తా ఉన్నహైడ్రాకు మేమంతా అండగా ఉన్నామని.. నగర ప్రజలు ఇప్పటికే హైడ్రాతో కలిసి పని చేస్తున్నారని పలువురు తెలిపారు.






