కూటమి సర్కార్ కృత నిశ్చయంతో ఉందని స్పష్టం
అమరావతి : రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి ధరలు పతనమైనప్పుడు రైతులు పడిన శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా రక్షించాలనే భావనతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఒక క్వింటాలుకు రూ. 1200 పెట్టి మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్‌లో సుమారు 18 కోట్ల విలువ గల ఉల్లిని ప్రభుత్వం సేకరించిందని చెప్పారు.
ఇప్పటికే 10 కోట్ల నగదును రైతుల ఖాతాలలో జమ చేసామని, మిగిలిన 8 కోట్లను అతి త్వరలోనే రైతులకు అందచేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేవలం మార్కెట్ జోక్యం ద్వారా ఉల్లి కొనుగోలు ఒక్కటే రైతులుని ఆదుకోలేదని సీఎం చంద్రబాబు గ్రహించి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రతి హెక్టారుకు 50 వేలు అందచేయాలని నిర్ణయించారని, దీనితో వేలాది మంది ముఖ్యంగా కర్నూలు , కడప రైతులు పంట పాడై భారీ నష్టాల బారిన పడకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుందని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ. 50,000 చొప్పున నష్ట పరిహారం అందించేందుకు తీసుకున్న నిర్ణయం రైతుకు నిజమైన అండగా నిలిచిందని పేర్కొన్నారు.






