అమీర్పేట, ప్యాట్నీ పరిసర కాలనీల ప్రజల ర్యాలీలు
హైదరాబాద్ : వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు మైత్రివనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు. 5 సెంటీమీటర్ల వర్షం పడితే అతలాకుతలం అయిన తమ కాలనీలకు వరద ముప్పు తప్పించారంటూ హైడ్రాకు, కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అమీర్ పేట మైత్రివనం వద్ద నడుము లోతు నీళ్లు నిలబడి ఉండేవని, ఇబ్బందులు పడేవాళ్ళం అని గుర్తు చేశారు.
హైడ్రా రావడంతో తమ ఇక్కట్లు తొలగి పోయాయని బాధితులు పేర్కొన్నారు. అక్కడి భూగర్భ పైపులైన్లలో పూడికను పూర్తిగా తొలగించిందన్నారు. దీంతో ఇటీవల 15 సెంటీమీటర్ల వర్షం పడిన వరద నీరు నిలవలేదు అని చెబుతూ హైడ్రా పనితీరుకు అభినందనలు తెలిపారు. ఎక్కడికక్కడ నాళాల్లో పూడిక పేరుకు పోవడంతో అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ రోడ్లమీద పారేదన్నారు. నేడు హైడ్రా చర్యలతో ఆ సమస్య పరిష్కారం అయ్యిందని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలో హైడ్రా అనేక విజయాలు సాధించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా ఇక్కడకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కార బాధ్యతను హైడ్రాకు అప్పగించారని తెలిపారు.






