17.65 లక్షల మంది పాల్గొన్నారన్న షర్మిల
అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయనను ఏకంగా ఓట్ల దొంగ అంటూ మండిపడ్డారు. బీజేపీ, హిందూ సంస్థల నిర్వాకం కారణంగానే కంటిన్యూగా మూడుసార్లు దేశంలో అధికారంలోకి వచ్చారంటూ ధ్వజమెత్తారు. అక్రమంగా అధికారంలోకి వచ్చి నీతులు చెప్పడం మోదీకే చెల్లిందన్నారు. ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఒక్కటే సక్రమంగా పని చేస్తోందన్నారు షర్మిలా రెడ్డి. దానిని కూడా నిర్వీర్యం చేయాలని మోదీ చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ఓట్ల చోరీపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.
ఇక ఈ దేశంలో ఒకే ఒక్క అవకాశం ఓటు వేయడమేనని, ఇందులో ధనిక, పేద అంటూ ఎవరూ ఉండరన్నారు. అందరికీ సమానమైన అవకాశం ఏర్పడుతుందన్నారు షర్మిలా రెడ్డి. కానీ దానిని కూడా రాజకీయం చేయాలని అనుకోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్లు ఇవాళ మోదీ చేతిలో కీలుబొమ్మగా మారారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్. అవసరం అయ్యే చోట దొంగ ఓట్లు చేర్చడం లేని చోట ఓట్లు తొలిగించే పని మాత్రమే చేస్తోందన్నారు. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పని చేస్తోందన్నారు. ఓట్ చోర్- గద్దె చోడ్ నినాదంతో రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన సంతకాల సేకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా సాగిందన్నారు. 17.65 లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారని తెలిపారు.






