ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు
హైదరాబాద్ : హైడ్రా పనితీరుకు ఫిదా అవుతున్నారు నగరవాసులు. కబ్జాకు గురైన ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అంతే కాకుండా ఆక్రమణకు లోనైన ప్లాట్లను, స్థలాలకు ఫెన్సింగ్ వేస్తోంది. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తోంది. మరో వైపు పెద్ద ఎత్తున ముంపునకు గురైన ప్రాంతాలను కూడా కాపాడింది హైడ్రా. ముంపునకు గురైన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనేక సార్లు పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇక్కడి కష్టం తెలుసు.హైడ్రాతోనే ఈ సమస్య పరిష్కారం అయ్యింది. హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు వచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు కాలనీ వాసులు.
ప్యాట్నీ నాలాను విస్తరించి పైన ఉన్న ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. పాయిగా కాలనీ, ప్యాట్నీ కాలనీ, విమాన్నగర్, బీహెచ్ ఈ ఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్ ఇలా అనేక కాలనీలను వరద ముంచెత్తేదని, నీళ్లు ఇళ్లలోకి వచ్చేవని తెలిపారు. కానీ హైడ్రా కారణంగా ఈ ఏడాది ఈ సమస్యలే మీ ఎదురు కాలేదన్నారు ఆయా కాలనీల వాసులు. 70 అడుగుల నాలా ప్యాట్నీ వద్ద 15 నుంచి 18 అడుగులకు కుంచించుకు పోవడంతో ఇబ్బంది ఉండేదని.. హైడ్రా వచ్చి నాలా ను వాస్తవ వెడల్పునకు విస్తరించడంతో సమస్య పరిష్కారం అయ్యిందని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఈ సమస్య ఉండడం వల్ల వర్షం వస్తే మా కార్లన్నీ మునిగిపోయి లక్షల రూపాయల నష్టాలు వచ్చేవని వాపోయారు. దశాబ్దాల సమస్యను ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా పరిష్కరించిందని సంతోషం వ్యక్తం చేశారు.






