నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మందిని తొక్కడం, మాట తప్పడం, మోసం చేయడం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ అంటూ ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి దిగజారుడు మాట్లాడటం దారుణమన్నారు. తను సీఎంనన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడని , దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడి పోతున్నానన్న భయం తనలో మొదలైందన్నారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఇంత వరకు చేసిన పాపాన పోలేదన్నారు హరీశ్ రావు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును సచివాలయానికి పెడితే తట్టుకోవడం లేదన్నారు. ఆయన పేరు ఉందని అక్కడికి వెళ్లడం కూడా మానేశాడని, ఇక ఈయన ఏం పాలన సాగిస్తాడని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి . దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి పోయాయని, ఆ విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డిని ఎవరు కాపాడుతున్నారో తెలియదా అని ప్రశ్నించారు.






