స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం
తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. అంతకు ముందు ఏర్పాట్లను పరిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి ఈవో ఆహ్వానించారు. అంతకు ముందు,టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి నవంబర్ 17వ తేది సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ నవంబర్ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయం నుండి వచ్చే సారె ఊరేగింపు సందర్భంగా తిరుపతి నగరంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పంచమి తీర్థం రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈసారి మహిళా పోలీసులను ఎక్కువ మందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
టిటిడి సివిఎస్వో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు అవసరమైన సిసి కెమెరాలను , సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి నాలుగు మాడ వీధులలోను, పంచమి తీర్థం రోజున ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టిటిడి ఈవో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేఈవో, సివిఎస్వోలు అధికారులతో కలిసి ఆలయ వాహన మండపం, నాలుగు మాడ వీధులలో, పద్మ సరోవరం, గేట్ నెంబర్ – 4, జెడ్పీ హైస్కూల్, పూడి, నవజీవన్ హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, సీఈ టి.వి. సత్యనారాయణ, ఎఫ్.ఎ అండ్ సీఏవో ఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.






