సమీక్ష చేపట్టిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేలా, వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో జరిగిన ఎస్వీబీసీ బోర్డు మీటింగ్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎస్వీబీసీలోని మానవ వనరులు, ఆర్థిక వ్యవహారాలు, ఉత్పత్తి, సరఫరా, నిల్వలు తదితర విభాగాల అంశాలను ఒకే సమగ్ర సాఫ్ట్ వేర్ వ్యవస్థలో సమన్వయం చేసేందుకు సంస్థ వనరుల సమగ్ర ప్రణాళికా వ్యవస్థను (ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) తీసుకు రావాలని సూచించారు. అంతేకాక ఇప్పటి వరకు ఎస్వీబీసీలో ఫైల్స్ ను భౌతికంగా తీసుకువచ్చి రోజువారి, నెలవారీ కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు తీసుకుంటున్నారని, ఇకపై తదితర అంశాలను ఈ – ఆఫీస్ ద్వారా నిర్వహించే ప్రక్రియను చేపట్టాలన్నారు.
ఈ – ఆఫీస్ ద్వారా సాంకేతికత సేవలను సంస్థలో అమలు చేయడం ద్వారా రికార్డులను పటిష్టంగా, వ్యవస్థలు నిర్మాణాత్మకంగా మార్చ వచ్చన్నారు. ఎస్వీబీసీలో ఆర్థిక అంశాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రభుత్వం నుండి లేదా అటానమస్ సంస్థ నుండి ప్రత్యేకంగా అకౌంట్స్ ఆఫీసర్ ను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఇంఛార్జీ సీఈవో డి. ఫణికుమార్ నాయుడు, ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, తదితర అధికారులు పాల్గొన్నారు.






