newsseals.com
News

కాళోజీ వీసీ నంద‌కుమార్ రెడ్డిపై విచార‌ణ చేప‌ట్టాలి

VijayaBhaskar November 28, 2025
newsseals-HarishRao
Spread the love

డిమాండ్ చేసిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాళోజీ వైద్య విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ గా ఉన్న నంద కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్రైవేట్ కాలేజీల‌కు చెందిన ఐదుగురు ప్రాక్టిక‌ల్స్ లో ఫెయిల్ అయితే తిరిగి వాళ్లు ఎలా పాస్ అవుతార‌ని ప్ర‌శ్నించారు. ఎన్ని కోట్లు లంచంగా తీసుకున్నాడో చెప్పాల‌న్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారే కావడం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు హ‌రీశ్ రావు. వైస్ ఛాన్సలర్ ఆ కాలేజీలతో ఎన్ని కోట్ల రూపాయల డీల్ చేసుకున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు.

కాళోజీ యానివర్సిటీ స్కాం విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరున్నార‌ని, ఎందుకు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఈ స్కాం వాస్తవాలు వెలుగు చూడకుండా, వీసీ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రీ-కౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ విశ్వ విద్యాలయ చరిత్రలోనే మొదటిసారి కావడం, ఇది నిబంధనల ఉల్లంఘనకు స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. మీడియాతో హ‌రీశ్ రావు మాట్లాడారు. విశ్వ విద్యాలయ నిబంధనలు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఈ అక్రమాలు జరగడం వైద్య విద్యా వ్యవస్థకు మాయని మచ్చ అని ఆవేద‌న చెందారు.

విశ్వవిద్యాలయం, ఎన్‌ఎమ్‌సీ నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ రీ-వాల్యుయేషన్ చేయడం అనేది అక్రమం అని అన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత వైస్ ఛాన్సలర్ స్వయంగా సమాధాన పత్రాల్లోని క్రాస్ మార్క్ ఉన్న పేజీల్లో విద్యార్థులతో సమాధానాలు రాయించి, తిరిగి మూల్యాంకనం చేయించి, ఎక్కువ మార్కులు వేయించి ఐదుగురిని పాస్ చేయించారని అందులో ఒక విద్యార్థి విజిలెన్స్ విచారణలో స్పష్టంగా వెల్లడించాడ‌ని తెలిపాడు. పీజీ వైద్య పరీక్షలను సజావుగా నిర్వహించడంలో వైస్ ఛాన్సలర్ పూర్తి వైఫల్యం చెందారని ఆరోపించారు హ‌రీశ్ రావు.