సంచలన ప్రకటన చేసిన మంత్రి ఎస్ సవిత
పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 435 మందికి, పెనుకొండ నియోజక వర్గంలో 56 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఇంకా అర్హులు ఉన్నారని, వారందరికీ త్వరలో నూతన పెన్షన్లు అందజేస్తామని ప్రకటించారు. పెన్షన్లతో పాటు ఇళ్లులేని పేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు మంత్రి సవిత. నియోజక వర్గంలో అసంపూర్తిగా నిలిచి పోయిన 18 విలేజ్ క్లినిక్ లకు కూటమి ప్రభుత్వం రూ.10.50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. నల్లూరులో రూ.20 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మిస్తున్నామన్నారు. వాటితో పాటు రొద్దంలో రూ.8.50 కోట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత 73 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
తొమ్మిది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, 44 గోకులం షెడ్లు నిర్మించామన్నారు మంత్రి సవిత. నల్లూరు నుంచి కల్లుకుంట్ల కు రూ.4.50 కోట్ల వంతెన నిర్మించామన్నారు. కల్లుకుంట్ల నుంచి పెద్దగువ్వలపల్లి వరకూ 75 లక్షలతో సీసీ రోడ్డు, డీఆర్ కొట్టాలలో రూ.2.03 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.2.50 కోట్లతో రొద్దం-చిన్న గువ్వలపల్లి చేపట్టిన రోడ్డు పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. ఆసుపత్రికి అదనపు గది నిర్మాణానికి రూ.50 లక్షలు వెచ్చిస్తున్నామన్నారు. దొడగడ్డలో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. LGB నగర్ నుంచి మడకశిర వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.02 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద రొద్దం మండలంలో 86 మందికి రూ.కోటీ 10 లక్షలు అందజేశామన్నారు. సానిపల్లిలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు.






