ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం
కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర ద్వాదశి నాడు అత్యంత వైభవోపేతంగా ఆరంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా దంపతులు, పర్యవేక్షణలో నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ, పీ నాగిరెడ్డి, ప్రసన్న, పీ వీ సుబ్బారెడ్డి, సుమలత ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఆలయంలోని ఉత్సవ మూర్తులకు వేద పండితులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ప్రాధాన్యతను వేద పండితులు వివరించారు.
ఉత్సవాల తోలి రోజు స్నపన తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురారోహణ, వాహనం (తిరుచ్చి), పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, డోకిపర్రు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి తిరుమలలో మాదిరిగా బ్రహ్మోత్సవాలు డోకిపర్రులో కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన ఆచార్యులు శ్రీధర్ వివరించారు. డిసెంబర్ ఐదో తేదీ వరకు ప్రతిరోజు విశేష హోమాలు, ఉత్సవాలు, ఊంజల, వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతాయి. వైఖానస, ఆగమ శాస్త్ర ప్రకారం డోకిపర్రు మహాక్షేత్రంలో జరిగే అర్చన కైంకర్యాల ఫలం రాజ, రాష్ట్ర, గ్రామ, యాజమాన్య, ఆచార్య,అర్చక, పరిచారికలకు ఆయా వైభవం కొద్దీ లభిస్తుందని అనుగ్రహ భాషణలో వేద పండితులు తెలిపారు.






