అడిషనల్ కమిషనర్ భరోసా
హైదరాబాద్ : భూ ఆక్రమణదారులు, కబ్జాదారుల నుంచి తమను రక్షించాలంటూ బాధితులు వాపోయారు. ఈ మేరకు హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా వాణికి ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు హైడ్రా అడిషనల్ కమిషనర్. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉంటుండగానే అక్కడ కొన్ని ఇళ్లు వచ్చేశాయని, ఓ ఫంక్షన్‌హాల్ ను నిర్మించి ప్రతి కార్యక్రమానికి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చేలోపు మరిన్ని అక్కడ నిర్మాణాలు జరగకుండా ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని ప్రజావాణి ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలోని వెస్ట్ గాంధీ నగర్‌తో పాటు పలు కాలనీల నుంచి మురుగు నీరు, వరద నీరు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు హైడ్రాకు పిర్యాదు చేశారు.
ఈ కాలనీల నుంచి వర్షపు నీరు కోమటి కుంటకు వెళ్లేవని.. ఆకాలువకు ఆనుకుని ఉన్న స్థలాన్ని సొంతం చేసుకున్న వారు, నాలాను పూడ్చేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 4 వేల గజాల ప్లాట్ కొన్నవాళ్లు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని వారి వద్ద తాజాగా కొన్నవారు అమలు చేయక పోవడమే కాకుండా ఉన్న కాలువను ధ్వంసం చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. దీంతో పైన ఉన్న కాలనీల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని., గతంలో ఉన్న కాలువను పునరుద్ధరించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం శ్రీ రమణ కాలనీ సర్వే నంబరు 60లో ప్రభుత్వ భూమిలోకి జరిగి 8 దుకాణాలు నిర్మించుకుని వ్యాపారం చేసుకుంటున్నారని.. స్థానికంగా ఉన్న పలు ప్రభుత్వ విభాగాలకు ఇప్పటికే ఫిర్యాదు చేశామని అయినా ప్రయోజనం లేకపోయిందని ప్రజావాణిలో స్థానికులు వాపోయారు. పక్కనే ప్రభుత్వ పాఠశాలకు ఆక్రమణలో ఉన్న దాదాపు 200ల గజాలతో పాటు.. మొత్తం 700ల గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు.






