ఇక నుంచి టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇక నుంచి శ్రీవారి అన్న ప్రసాదం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టిటిడి పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్.ఓ.పి) రూపొందించాలన్నారు. వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు ఈవో. పోటు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక, పాచిక పేర్లను మార్చాలని టిటిడి బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. టిటిడిలోని అర్భన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్ట పర్చేందుకు వీలుగా తగిన సిబ్బంది తో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు.
శ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా (క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ) ప్రణాళికలు రూపొందించాలన్నారు ఈవో. తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టిటిడి శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈవో. 25 ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయం తో పాటు ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి మురళీకృష్ణ, ఎఫ్.ఏ.అండ్ సీఏవో ఓ బాలాజీ, సీఈ శ్రీ టి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






