అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని, ఈ వేళలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. కేవలం సామాన్య భక్తులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు ఈవో. డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేశామన్నారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు దాదాపు 26 లక్షల మందికి పైగా భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
డిసెంబర్ 02వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయించినట్లు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా మొదటి మూడు రోజులు ఎస్ఈడీ టోకెన్లు., శ్రీవాణి దర్శనాలు రద్దు చేశామన్నారు ఈవో. మిగిలిన 7 రోజులకుగా ను ఈరోజు (5వ తేదీ )ఉదయం 10 గం.లకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గం.లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం అన్నారు. (రోజుకు శ్రీవాణి దర్శనం – 1,000, SED – 15,000). జనవరి 02 నుండి 08వ తేదీ వరకు VQC – 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. ఈ 10 రోజులలో తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. కాగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం కల్పించామన్నారు.






