ధనుర్మాసం సందర్భంగా కీలక నిర్ణయం
తిరుపతి : టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుందని తెలిపారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 4 నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయడం లేదని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తామని వెల్లడించారు ఈవో. మొదటిరోజైన డిసెంబరు 16న సాయంత్రం ధనుర్మాసం గంట కారణంగా సహస్ర దీపాలంకార సేవ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆలయంలో నెల రోజుల పాటు ఉదయం 5.15 నుండి 6.15 గంటల వరకు ధనుర్మాసం గంట, ధనుర్మాస దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, ఉదయం 5.30 నుండి 6.30 భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. అప్పలాయ గుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, ప్రత్యేక పూజలు , ఉదయం 6 నుండి భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తామని తెలిపారు.






