స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏది చెబుతామో దానిని చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. పూర్తిగా పారదర్శకత పాలన అందిస్తున్నామని చెప్పారు. తాజాగా తాను ఎన్నికల సందర్బంగా చేపట్టిన యువగళం పాదయాత్రలో కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన హమీ మేరకు చాలా కష్టపడి ప్రకటించిన మేరకు గడువు లోపే 5,500 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని అన్నారు నారా లోకేష్. నా హామీని నెరవేర్చేందుకు కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపట్టి పూర్తి చేసిన హోం మంత్రి వంగలపూడి అనితకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని అన్నారు. ఈ పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు వేసిన కుట్రపూరిత కేసులను అత్యంత చాకచక్యంగా పరిష్కరించడం వెనుక అధికార యంత్రాంగానికి హోం మంత్రి గారు పూర్తి సహాయ, సహకారాలు అందించారని చెప్పారు. సీఎం , డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికీ , అనితతో పాటు డీజీపీని కూడా అభినందిస్తున్నట్లు తెలిపారు నారా లోకేష్.






