25 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగ నాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. కాగా ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ.






