హెచ్చరించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు
తిరుపతి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పోలీసులకు టీటీడీ తరపున బ్రీత్ అనలైజర్లను పంపిణీ చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సంస్థ భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ పరికరాలను అందజేయడం జరిగిందని చెప్పారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మద్యం సేవించిన వారిపై ఫోకస్ పెడ్తామన్నారు. అలాంటి వారిపై కఠిన కేసులు నమోదు చేసి, జైలు శిక్షతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు నివేదిస్తామన్నారు. చిన్న అజాగ్రత్త మీ ప్రాణాలనే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా హరించే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల నష్టం కలిగేది కేవలం తప్పు చేసిన వ్యక్తి కుటుంబానికే కాదు, నిర్దోషులైన ఇతరుల కుటుంబాలకు కూడా తీవ్ర వేదన కలుగుతుందన్నారు ఎస్పీ.
ఈ విషయాన్ని ప్రతి వాహనదారుడు గమనించాలని సూచించారు. ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు సుబ్బారాయుడు. ఎస్పీ బ్రీత్ అనలైజర్ల పనితీరును టీటీడీ ఈవోకు వివరించారు. మొత్తం 20 పరికరాలలో 4 తిరుమలలో, 4 అలిపిరిలో, 12 తిరుపతిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖలు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవి మనోహర ఆచారి (శాంతి భద్రతలు) , డిఎస్పి రామకృష్ణ ఆచారి (ట్రాఫిక్) , డిఎస్పి చంద్రశేఖర్ (ఏ ఆర్) తిరుపతి, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.








