తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శేషాచలం అడవుల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది టీటీడీ. టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతు వనం, విశిష్ట వృక్ష వనం, ఔషధ మొక్కలు వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా, ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి.
తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచి, భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలపడం విశేషం.








