దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీలక ప్రకటన
తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘం లోని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లతో కలిసి ఆయన టీటీడీ, జిల్లా, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పది రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు అంటే దాదాపు 90 శాతం సామాన్య భక్తులకే కేటాయించినట్లు చెప్పారు ఆనం రామ నారాయణ రెడ్డి.
ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. తొలి మూడు రోజుల దర్శనాలకు 27 రాష్ట్రాల నుండి 23.64 లక్షల మంది ఈ-డిప్ కు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ డిప్ ద్వారా 1.89 లక్షల మంది సామాన్య భక్తులకు టోకెన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు మంత్రి. కాగా భక్తులు ఏరోజు, ఏ సమయానికి దర్శనానికి రావాలో ముందస్తుగానే సమాచారం ఇచ్చామన్నారు ఆనం రామ నారాయణ రెడ్డి. టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. స్వామివారి దర్శనాలకు విచ్చేసే భక్తులకు విరివివిగా అన్న ప్రసాదాలు, తాగునీరు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూలైన్ల నిర్వహణ ఉంటుందన్నారు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులకు పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగేలా నిబద్ధతతో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, దేవాదాయశాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.






