స్పష్టం చేసిన మంత్రులు దుర్గేష్, పయ్యావుల
అమరావతి : ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను వినియోగించాలనే లక్ష్యంతో అమరావతి సచివాలయంలో మూడవ మంత్రివర్గ ఉపసంఘ భేటీ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే దిశగా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పారు. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న మొత్తం 9 ఎకరాల్లో 7 ఎకరాల్లో నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదని స్పష్టమైందని అన్నారు. అందుబాటులో ఉన్న 2 ఎకరాలు, అలాగే కొండపై నిర్మాణానికి అనుకూలమైన విస్తీర్ణాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలన్న అంశంపై విస్తృతంగా చర్చించామన్నారు.
రుషికొండ ప్యాలెస్‌ను హాస్పిటాలిటీ రంగానికి అనుసంధానం చేస్తే ప్రభుత్వానికి స్థిర ఆదాయం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమైందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయని స్పష్టం చేశారు కందుల దుర్గేష్ , పయ్యావుల కేశవ్. అయితే వయబుల్, చట్టబద్ధమైన, దీర్ఘకాల ప్రయోజనాలు కలిగిన ప్రాజెక్ట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గతంలో పర్యాటక శాఖకు ఏటా ఆదాయం తెచ్చే రిసార్ట్స్ స్థానంలో నిర్మించిన ప్యాలెస్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోవడంతో పాటు నెలకు భారీ నిర్వహణ భారం పడిందన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.






