ప్రాజెక్ట్ నిర్మాణాన్నిపరిశీలించిన సీఈఓ
అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న తీరుపట్ల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పీపీఏ బృందం సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలో బుధవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. ఈ బృందంలో సీఈఓ పైతాన్కర్ తోపాటు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె శంకర్ తదితరులు ఉన్నారు. వీరికి జలవనరుల శాఖ ఈ ఎన్ సి కే నరసింహ మూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏఎన్వీ సతీష్ బాబు ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని వివరించారు. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న పీపీఏ బృందం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. పైతాన్కర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత తోలి పర్యటన కావటంతో ఆయన అన్ని నిర్మాణాలను పరిశీలించారు. వాటి పురోగతి గురించి తెలుసుకున్నారు. అవగాహన చేసుకున్నారు. తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఎంఈఐఎల్ నిర్మిస్తున్న పోలవరం జల విద్యుత్ కేంద్రంను కూడా ఆయన పరిశీలించారు. జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పురోగతిని ఎంఈఐఎల్ సిఓఓ సతీష్ బాబు పీపీఏ బృందానికి వివరించారు. పీపీఏ బృందం పర్యటనలో క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ కే శేషుబాబు, ఎస్ ఈ కే రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ తిరుమలరావు, ఈఈ కే బాలకృష్ణ, జిఎం ఏ గంగాధర్, డిజిఎం మురళి పమ్మి క్వాలిటీ కంట్రోల్ ఈఈలు నరసింహారావు, ప్రేంచంద్, డీఈలు నిర్మల, శ్రీకాంత్, విజయకుమార్, క్వాలిటీ కంట్రోల్ డీఈ శివప్రసాద్ తదితరులు పాల్గొని పనుల వివరాలను వారికి వెల్లడించారు. అంతకు ముందు పీపీఏ బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.






