రౌడీయిజం చేస్తే తోలు వలుస్తామని వార్నింగ్
తిరుపతి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా భ్రష్టు పట్టాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదన్నారు. బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారని.. గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పారేసి పోయారని అన్నారు. ఆ తర్వాత అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పెట్టుకోవాలన్నారు.
రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతు బలులు ఇచ్చి పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచిందని సీఎం తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తిరుపతిలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను సీఎం అభినందించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడంలోనూ, పీడీ యాక్టుల అమలులోనూ పోలీసులు చూపుతున్న చొరవను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత , రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్త, కలెక్టర్ , ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.







