సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత
నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం డంపింగ్ యార్డు పట్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమన్ గల్ పట్టణంలోని గుర్రగుట్టం కమల్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జనావాసాల్లో పెద్ద డంపింగ్ యార్డ్ ను పెట్టారని, దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతూ గత ఆరు సంవత్సరాలుగా ప్రజలు దరఖాస్తూ చేశారని, ధర్నాలు చేపట్టారని ఇప్పటి వరకు స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు ఆరోగ్య పరంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. ఇటీవలే ఒక బాలింత కూడా చనిపోయిందని చెప్పారని తెలిపారు. ఇక్కడి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నిద్ర పోతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై దృష్టి సారించాలని అన్నారు. అధికారులకు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ వాళ్లు కనీసం పట్టించుకోక పోవడం పై మండిపడ్డారు. ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం కోటి 20 లక్షలు కూడా మంజూరు చేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు 1994 లో గుట్టలల్లో ఇళ్లులు ఇచ్చారని, అవి చాలా చిన్నగా ఉన్నాయని, ఇక్కడ కూడా వారిని పొమ్మన లేక పొగబెట్టినట్లు చేస్తున్నారంటూ ఆవేదన చెందారు.






