TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ
భువనగిరి జిల్లా : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పట్ల తెలంగాణ సర్కార్ వివక్ష చూపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. యాదగిరి గుట్టలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బంధమే మన సంఘ నిర్మాణం అని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని నిలబెట్టడంలో జర్నలిస్టుల సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. నాడు ఎంతో సాధించిన జర్నలిస్టులు నేడు గుర్తింపు కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు. హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. 252 జీవో కు వ్యతిరేకంగా పోరాటంలో నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటాలన్నారు. అందరికీ అక్రెడిటేషన్ కార్డులు సాధించే దాకా విరమించేది లేదన్నారు. సక్సెస్
చేసిన 33 జిల్లాల సంఘ నేతలకు, సభ్యులకు అభినందనలు తెలిపారు అల్లం నారాయణ.
భవిష్యత్ లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేద్దాం అని పిలుపునిచ్చారు. గుర్తింపు కార్డులడిగితే రాజకీయాలంటారా అని మండిపడ్డారు సర్కార్ పై. అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులను కలిసి మన గుర్తింపు కోసం డిమాండ్ చేయాలని, వినతి పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వినతి పత్రాలు ఇవ్వాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించిందన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపిన నేపధ్యంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా కమిటి నిర్ణయిందన్నారు. మొదటగా వినతి పత్రాలు ఇచ్చి, అసెంబ్లీలో చర్చించే విధంగా ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ చేపట్టాలని నిర్ణయిస్తూ, ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం రావాలని, లేనిపక్షంలో పోరాట మార్గాన్ని అనుసరిస్తామన్నారు.






