పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్ : యావత్ ప్రపంచంలోనే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే మహా జాతర మేడారం సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర కొనసాగుతుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మేడారం జాతర పోస్టర్ ను శాసన సభ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ నెల 19న సమ్మక్క–సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
సరికొత్తగా అభివృద్ధి చేసిన మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా, పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతోంది. సమ్మక్క–సారలమ్మల త్యాగాలు, ఆదివాసీల చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహరీలు రూపొందించారు. ఆదివాసి సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం అందంగా ముస్తాబైంది . ఏటా లక్షల సంఖ్యలో భక్తులు మేడారాన్ని దర్శించుకుంటున్న నేపథ్యంలో, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు , ఇతర ప్రముఖులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు మంత్రి కొండా సురేఖ. ఆహ్వానం అందుకున్న ప్రముఖులు ఆదివాసి అతిపెద్ద జాతరకు తప్పకుండా హాజరవుతామని తెలిపారు.








