ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గతంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు . ఎస్వీబీసీ ఛానల్ లో నాణ్యమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మరింత వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యం అన్నదానం కూడా పంపిణీ చేయనున్నట్లు స్పస్టం చేశారు ఈవో.
ఇదిలా ఉండగా దాతలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తిరుమల ఆలయంతో పాటు అదనంగా, స్థానిక, అనుబంధ ఆలయాలలో అన్న ప్రసాదాల పంపిణీకి విరాళాలు అందించే దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాలలో శ్రీ వేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్య, వైద్య, న్యాయ, అటవీ ,ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలపై కూడా సమీక్షలు నిర్వహించారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో కె.వి. మురళీ కృష్ణ, ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.








