సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల సేవలతో పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా ఉండవన్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో రథ సప్తమి సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. అనంతరం ఏఈవో మీడియాతో మాట్లాడారు . కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా ఉండవన్నారు.
తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేశామన్నారు ఏఈవో వెంకయ్య చౌదరి. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలుకూడా రద్దు చేసినట్లు తెలిపారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదన్నారు. ఇక స్వామి వారి వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.








