146 మంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు
తిరుమల : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది . ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడారు. వేద విజ్ఞాన పీఠంలోని 146 విద్యార్థులను వేద, ఆగమ, స్మార్త పండితులుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. పట్టాలు పొందిన స్నాతకులు విద్యార్థిగా నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తర్వాత మంచి విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షించారు. దేనికైనా అంతం ఉంటుంది కానీ విద్యకు అంతం ఉండదని తెలియజేశారు.
ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడ చదువు కునేందుకు వీలు కలుగుదని చెప్పారు శివ సుబ్రమణ్య అవధాని. ఎక్కడ పని చేసినా ఆ పదవికి వన్నె తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. అన్నిటికంటే ముఖ్యం జీవితంలో నియమ నిబద్దతతో జీవించడం అన్నారు. అనంతరం వేద విద్య పూర్తి చేసుకున్న 146 మంది స్నాతకులకు పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పండితులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.








