స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
శ్రీశైలం : శ్రీశైలంలోని మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా. శ్రీశైంలో ఆమె సమీక్ష చేపట్టారు ఏర్పాట్లపై. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో చోటుచేసుకున్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవలని స్పష్టం చేశారు. అలాగే సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫారెస్ట్, పోలీస్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడారు. శ్రీశైలంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు 7 ప్రదేశాల్లో హైడ్రాలిక్ క్రేన్లు, రికవరీ వ్యాన్లను అందుబాటులో ఉంచామన్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు 27 ఎకరాల విస్తీర్ణంలో 5,450 వాహనాలు పార్కింగ్ చేయగల సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 36 లక్షల లడ్డు ప్రసాదాలను తయారు చేయడంతో పాటు, వాటి పంపిణీ కోసం 15 లడ్డు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డీఎఫ్వోలు విగ్నేష్ అపోవా, నీరజ్, భవిత కుమారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, అనిల్ కుమార్, గుండ్ల గంగమ్మ, కాశీనాథ్, రేఖ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.








