33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాల సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 41.14 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. భక్తులకు 44 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించడం జరిగిందన్నారు. దాదాపు 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. వివిధ విభాగాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు బీఆర్ నాయుడు. తిరుమల, తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలా 400 ప్రచార బోర్డులు ఏర్పాటు చేశామన్నారు..
రేడియో బ్రాడ్ కాస్టింగ్ ద్వారా 5 భాషల్లో వైకుంఠ ద్వార దర్శనాలపై అవగాహన కల్పించామన్నారు. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణపై భక్తులు విశేష ప్రశంసలు లభించినట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో నీటి కొరత లేకుండా నిరంతరాయం భక్తులకు నీటి సరఫరా చేశామన్నారు.
ఈ పది రోజుల్లో 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేసినట్లు తెలిపారు. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోల్చితే ఈసారి 9.29 లక్షల మంది భక్తులకు అదనంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు . తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి బాదం పాలు సరఫరా చేసినట్లు తెలిపారు చైర్మన్.








