Friday, 16 October 2026

జవాబుదారీతనంతో పని చేయాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

newsseals-PawanKalyan

ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసిన ఉప ముఖ్య‌మంత్రి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు ఉద్యోగులు మ‌రింత బాధ్య‌తాయుతంగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ . అలసత్వం, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు పని చేయాలని నిర్దేశం చేశారు. విశాఖ కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, అడవితల్లి బాట, జల్ జీవన్ మిషన్ తదితర విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు. గత ఏడాది నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేశారా? లేదా? పూర్తి చేయకపోతే కారణాలు ఏంటి? అనే అంశాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తుంద‌న్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చల విడితనంతో ఇష్టారాజ్యంగా నిధులు దారి మళ్లించిందన్నారు. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు. రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. లక్ష్యాలకు విరుద్ధంగా ముక్కలు ముక్కలుగా పైపులు వేసి వదిలేసింది. పనులు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయిగాని, ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *