కేసీఆర్ పై క‌క్ష సాధింపు త‌గ‌దు : హరీశ్ రావు

VijayaBhaskar · February 2, 2026
Spread the love

సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కావాల‌ని మాజీ సీఎం కేసీఆర్ ను వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు.కేసీఆర్ దర్యాప్తున‌కు పూర్తిగా సహకరించార‌ని, అయినా పోలీసులు అతి చేశార‌ని ఆరోపించారు. వాళ్లు చ‌ట్టానికి లోబ‌డి ప‌ని చేయ‌డం లేద‌ని అన్నారు. సీఎం డైరెక్ష‌న్ లో ప‌ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తే జ‌నం ఛీ కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. కేసీఆర్ ను విచారించ‌డం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు హ‌రీశ్ రావు. సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడిగా ఆయ‌న పేర్కొన్నారు.

నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉందన్నారు. SIT పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారని ఆరోపించారు హ‌రీశ్ రావు . నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించ లేద‌ని అన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌక బారు రాజకీయానికి నిదర్శనం అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించి తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు.