newsseals.com
News

2027 కల్లా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

VijayaBhaskar February 6, 2026
newsseals-PoalavaramProject
Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

అమరావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కావాల‌ని ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కాలేద‌న్నారు. దీనికి జ‌గ‌నే కార‌ణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగానికి ప్ర‌త్యేకంగా ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిరుప‌యోగంగా ఉండేందుకు వీలు లేద‌న్నారు. ప్ర‌తి ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని, నదుల‌ను అనుసంధానం చేస్తామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్ర‌తి రైతుకు మేలు చేకూరేలా, ప్ర‌తి పొలానికి సాగు నీరందిస్తామ‌ని వెల్ల‌డించారు సీఎం.

నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులే ఇంజనీర్లుగా మారాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు. నీటి నిర్వహణను చేపట్టేలా శిక్ష‌ణ తీసుకోవాల‌ని అన్నారు. వినూత్న ప్రయోగాలు చేయాల‌ని సూచించారు. ప్రాజెక్టుల సంరక్షణకు రూ.68 కోట్లు ఖర్చు పెట్టిన‌ట్లు చెప్పారు. ఆ ఫలితాలే ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. సుపరిపాలన అందిస్తామని ఆనాడు హామీ ఇచ్చామ‌ని , ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ఇచ్చిన మాట ప్ర‌కారం అన్నింటిని హామీలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని ఆరోపించారు. క్లియరెన్సులు తీసుకోకుండా చేయటం వల్ల ఎన్జీటీ ఆ ప్రాజెక్టును నిలిపేసింద‌ని పేర్కొన్నారు సీఎం. నిలిచిపోయిన ప్రాజెక్టును మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు.