newsseals.com
News

ప్ర‌జా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు : రేవంత్ రెడ్డి

VijayaBhaskar February 14, 2026
newsseals-TPCCChief
Spread the love

హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపిన సీఎం

హైద‌రాబాద్ : రాష్ట్రంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక స్థానాల‌ను క‌ట్ట‌బెట్టినందుకు ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే ఆయ‌న స్పందించారు. ప్ర‌స్తుతం న్యూఢిల్లీలో ఉన్నారు. మ‌ర్యాద పూర్వ‌కంగా ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఎంపీ ప్రియాంక గాంధీని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా అద్భుత విజ‌యాన్ని సాధించినందుకు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , సీఎం రేవంత్ రెడ్డి, ఇత‌ర మంత్రుల‌ను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టినందుకు ఆనందంగా ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.

ప్రియాంక‌తో భేటీ అనంత‌రం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద – మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు.