నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ప్రాజెక్టులు నీరుగారి పోయాయని, వాటిని పట్టించు కోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశామని అన్నారు. కాగా 47 వేలు ఉన్న ఆయకట్టును 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచడం జరిగిందన్నారు. 33 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే, 30 వేల ఎకరాలు భూసేకరణ కూడా పూర్తి చేశామన్నారు.
ఇంకొక 3వేల ఎకరాలు భూసేకరణ చేసి, దాదాపు రూ.1,000 నుండి రూ.2,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 2,40,000 ఎకరాల ఆయకట్టు సృష్టించ వచ్చని అన్నారు తన్నీరు హరీశ్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏండ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలం చెందిందని ధ్వజమెత్తారు తన్నీరు హరీశ్ రావు.





