వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. నాయుడు మీడియాతో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్రం నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలియ చేసినట్లు తెలిపారు బీఆర్ నాయుడు.
ఇటీవల చాలామంది తమ స్వప్రయోజనాల కోసం తిరుమలలో అసత్య కథనాలతో రీల్స్ చేసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వాపోయారు. ఎంతో భక్తితో తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల మనో భావాలను దెబ్బ తినేలా పోస్టు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డా.ఎ.శరత్, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.







