ఇదేనా ప్రజా ప్రభుత్వం పాలన అంటూ మండిపడ్డ జగన్ రెడ్డి
అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై. ఓ వైపు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన పంటకు కనీస మద్దతు ధర రావడం లేదన్నారు. ఆదుకోవాల్సిన సర్కార్ మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు. బుధవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల కష్టాలు గురించి మాట్లాడటం, చర్చించడం కనీసం మచ్చుకకి కూడా కూటమి నేతలు చేయలేదన్నారు. ఓ వైపు అన్నదాతలు నానా తంటాలు పడుతుంటే ఇంకో వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మంత్రులు ఆటలు, పాటలు, స్కిట్ లతో కాలక్షేపం చేయడం దారుణమన్నారు. వీళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వ్యవసాయ రంగం రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభం నెలకొని అన్నదాతలు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసీ చూడనట్లు వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు. ఇక నిన్నటి దాకా టీటీడీపై చిల్లర రాజకీయం చేసిన ఘనత కూటమి సర్కార్ కు, సీఎం, డిప్యూటీ సీఎంలకే దక్కుతుందన్నారు. జనం ఛీ కొడుతున్నారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు జగన్ మోహన్ రెడ్డి.





