Friday, 16 October 2026

19న శ్రీ గోవింద‌రాజ స్వామి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

newssealss-UgadiAsthanam

మార్చి 16న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుప‌తి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది. శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 16వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మార్చి 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

ఇందులో భాగంగా సోమ‌వారం తెల్లవారు జామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *