ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యున్న‌త ప్రాధాన్య‌త

VijayaBhaskar · March 16, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన డిప్య‌టీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో విస్టా ఇమేజింగ్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు వైద్య భరోసా కల్పించడంతో పాటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం జ‌రిగింద‌ని చెప్పారు మ‌ల్లు భట్టి విక్ర‌మార్క‌. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మెడికల్ కళాశాలలు, 100 పడకల ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాల విస్తరణతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే తీసుకు వస్తున్నాం అన్నారు. సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు నిజమైన హీరోలు అని ప్ర‌శంస‌లు కురిపించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వృత్తి ధర్మాన్ని కొనసాగించాలని వైద్యులకు సూచించారు డిప్యూటీ సీఎం.