Friday, 16 October 2026

గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

newsseals-ChairPersson

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్

నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమం అంశాల్లో సమగ్ర చర్యల ద్వారా నంద్యాల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల వంటి వ్యవసాయాధారిత జిల్లాల్లో మహిళల భద్రతకు ‘లోకల్ కమిటీ’లు కీలక పాత్ర పోషిస్తాయని, వీటి ఏర్పాటు చట్టపరంగా తప్పనిసరని  పేర్కొన్నారు. గృహ హింస చట్టం అమలులో భాగంగా రక్షణ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తుచేస్తూ, బాధిత మహిళలకు సమయానుకూల సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పని ప్రదేశాల్లో మహిళలకు న్యాయం జరిగేలా లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) కింద కమిటీలు చురుగ్గా పని చేయడం అవసరమని వివరించారు.

మహిళా భద్రత విషయంలో పోలీసు విభాగం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఫిర్యాదుపై సున్నితంగా, వేగంగా స్పందించాలని కోరారు. ‘శక్తి టీమ్స్’ పనితీరును మరింత మెరుగు పరుస్తూ గ్రామీణ స్థాయిలో కూడా వాటి ఉనికిని పెంచాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా పర్యవేక్షణను బలోపేతం చేయడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పోక్సో , గృహ హింస కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, చట్టాల అమలులో ఎటువంటి ఆటంకాలు లేకుండా మహిళల అభివృద్ధిని సాధించడమేనని తెలిపారు. నంద్యాల జిల్లా ఇప్పటి వరకు మంచి పనితీరును కనబర్చిందని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాల కోసం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *