Friday, 16 October 2026

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

newsseals-Atchannaidu

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి : రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం / ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అచ్చెన్నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్ర పరచాలని, వడగళ్ల వాన, ఈదురు గాలుల సమయంలో పొలాల్లో ఉండకూడ‌ద‌ని, వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *