ఎన్టీఆర్ పెట్టిన ట్రస్ట్..దేవాన్ష్ విరాళం
తిరుమల : తిరుమల లోని శ్రీవారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్ శనివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా భక్తులతో ముచ్చటించారు. క్యూ కాంప్లెక్స్‌లో ప్రసాదం పంపిణీ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలు ఎలా ఉన్నాయో స్వయంగా చూశారు. లోపాలేమైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని టీటీడీకి సూచించేందుకు చంద్రబాబు ఇలా క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళతారు.
ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు తిరుమల కొండకు వచ్చే భక్తులకు అన్నప్రసాదంతో ఆకలి తీరుస్తూనే ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సులో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. ఈ ట్రస్టుకు తన మనుమడు దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారు. దేవాన్ష్ పేరుతో అన్నదానం కోసం 12 సార్లు విరాళం అందించారు. మొత్తంగా ఇప్పటి వరకూ రూ.3.40 కోట్లు అన్నదానం కోసం విరాళంగా అందించడం విశేషం.





