సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే.
తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు యాత్రికులకు హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు.
వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ విశాల డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ఉద్యమం ఉమ్మడి 13 జిల్లాలు, 100 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. సుమారు 1000 కిలోమీటర్ల మేర తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సాగుతున్న ఈ యాత్రలో పాల్గొన్న సైకిల్ యాత్రికులు శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకోగా డీఎస్పీ నరసింహ మూర్తి, వన్ టౌన్ సీఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి ఘన స్వాగతం అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, యాత్రికులతో కలిసి కొంత దూరం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును బలంగా నిర్మించండి, డ్రగ్స్‌ను వదిలేయండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆహ్వానించండి వంటి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.





